అభివృద్ధి చెందుతున్న దేశాల్లో టైఫాయిడ్ జ్వరం ఒక పెద్ద ఆరోగ్య సమస్యగా మారుతోంది. టైఫాయిడ్ లక్షణాలను బట్టి యాంటీ బయోటిక్స్‌ను వాడుతుండడంతో ఆ ఔషధాలను సైతం తట్టుకుని వ్యాప్తిచెందే బ్యాక్టీరియా విస్తరిస్తోంది. దీని పేరే సాల్మోనెల్లా టైఫి బ్యాక్టీరియా. ఏటా ప్రపంచ వ్యాప్తంగా 2 కోట్ల మంది టైఫి బ్యాక్టీరియా బారిన పడుతున్నారు. ఇందులో 2 లక్షల మంది చనిపోతున్నారు. ముఖ్యంగా పేద దేశాల్లో ఈ టైఫాయిడ్ తీవ్రత ఎక్కువగా ఉంటోంది. దీనివల్ల కలిగే నష్టమూ ఎక్కువే. దీన్ని తగ్గించడానికి టీకా (వ్యాక్సినేషన్)పై దృష్టి పెట్టాలి అంటున్నారు భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) డాక్టర్ కృష్ణ ఎల్లా. భారత్ బయో కొత్త తరం టైఫాయిడ్ టీకా ‘టైప్‌బార్ టీసీవీ’ ఎంతవరకు సురక్షితం.. ఏమేరకు సమగ్రంగా పనిచేస్తుంది… అనే అంశాలపై ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం ప్రపంచంలోనే తొలిసారి ‘హైరిస్క్ హ్యూమన్ ఛాలెంజ్’ క్లినికల్ అధ్యయనాన్ని నిర్వహించింది. ఈ అధ్యయనంలో భారత్ బయో వ్యాక్సీన్ నూటికి నూరు శాతం ఇమ్యునోజెనిక్ (యాంటీ బాడీలను ఉత్పత్తి చేసి బాక్టీరియాను పని చేయకుండా చేసే వ్యవస్థ) అని వెల్లడైంది. అలాగే టైఫాయిడ్ జ్వరం వచ్చిన వారిలో 87 శాతం వరకూ ఇన్ఫెక్షన్‌ను టైప్‌బార్ టీసీవీ నిరోధించింది. ఈ వివరాలను ప్రముఖ వైద్య పత్రిక లాన్సెట్ ప్రచురించింది. ‘టైప్‌బార్ టీసీవీ’ వ్యాక్సీన్ భద్రత, పనితీరును ఆక్స్‌ఫర్డ్ అధ్యయనం ప్రస్ఫుటం చేసిన నేపథ్యంలో డాక్టర్ కృష్ణ ఎల్లా ‘ఈనాడు’ కిచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు…
? భారత్ బయోటెక్ కొత్త తరం టైఫాయిడ్ వ్యాక్సీన్‌పై జరిగిన అధ్యయనం వల్ల ఎటువంటి ప్రయోజనాలు లభించనున్నాయో వివరిస్తారా..
టైప్‌బార్ టీసీవీ ప్రపంచంలోనే వైద్య పరీక్షల (క్లినికల్‌గా) పరంగా నిరూపితమైన తొలి కంజుగేట్ టైఫాయిడ్ వ్యాక్సీన్. చిన్న పిల్లల కోసం దీన్ని అభివృద్ధి చేశాం. 2 సంవత్సరాల కన్నా తక్కువ వయసున్న పసిపిల్లల నుంచి పెద్దవారికి కూడా ఈ టీకా వేయొచ్చు. తాజాగా ఆక్స్‌ఫర్డ్ విశ్యవిద్యాలయం నిర్వహించిన అధ్యయనంలో ‘టైప్‌బార్ టీసీవీ’ సురక్షితమని తేలడమే కాకుండా సమర్థంగా పనిచేసే వ్యాక్సీన్‌గా నిరూపితమైంది. మరిన్ని దేశాల్లో పసి పిల్లల ప్రాణాలను కాపాడేందుకు ఈ అధ్యయనం దోహదం చేస్తుంది. దాదాపు 14 సంవత్సరాల పాటు పరిశోధన చేసి ‘టైప్‌బార్ టీసీవీ’ని (టైఫాయిడ్ ్రౖ క్యాప్సులర్ పాలిశాక్రైడ్ టెటనస్ టాక్సైడ్ కంజుగేట్ వ్యాక్సిన్‌ను (టీసీవీ) అభివృద్ధి చేశాం. రెండేళ్లుగా భారత్, నేపాల్, నైజీరియా దేశాల్లో విక్రయిస్తున్నాం. కెన్యా, బంగ్లాదేశ్, పాకిస్థాన్ తదితర 30 దేశాల్లో నమోదు (రిజిస్ట్రేషన్) ప్రక్రియ జరుగుతోంది. ప్రీక్వాలిఫికేషన్ కోసం వ్యాక్సీన్ వివరాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ)కు సమర్పించాం. అనుమతి లభిస్తే.. యునిసెఫ్ ఈ వ్యాక్సీన్‌ను కొనుగోలు చేస్తుంది. అప్పుడు 100కు పైగా దేశాలకు సరఫరా చేసే అవకాశం లభిస్తుంది. డబ్ల్యూహెచ్‌ఓ అనుమతికి ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం అధ్యయనం దోహదం చేస్తుంది. ఈ అధ్యయనానికి బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ 40 లక్షల డాలర్ల సాయం చేసింది. నివారించడానికి వీలైన టైఫాయిడ్ వల్ల వేల మంది పసిపిల్లలు చనిపోతున్నారు. టీసీవీ వ్యాక్సీన్ ద్వారా వీటిని నివారించవచ్చు.
? ఈ వ్యాక్సీన్ పనితీరు, సురక్షితత్వాలపై ఇంకా ఏమైనా అధ్యయనాలు జరుగుతున్నాయా
అమెరికాకు చెందిన మేరీల్యాండ్, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయాలు ఈ వ్యాక్సీన్‌పై ‘ఎఫెక్టివ్‌నెస్ స్టడీస్’ చేయబోతున్నాయి. ఇందులో భాగంగా ఆఫ్రికాలోని మలావి, కెన్యా; ఆసియాలోని బంగ్లాదేశ్, నేపాల్‌లలో 5 లక్షల పసిపిల్లలకు ఈ వ్యాక్సీన్ ఇచ్చి రెండు, మూడేళ్లు టైఫాయిడ్ వచ్చిందా లేదా అన్న అంశాన్ని పరిశీలిస్తారు. ఇందుకు బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ మరో 3.69 కోట్ల డాలర్ల సాయం చేయనుంది. నవీ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్, అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) కలిసి నవీ ముంబయి ప్రాంతంలోని పేదలకు ఈ టీకా ఇచ్చి దీని పనితీరును పరిశీలిస్తారు.
? ఇంకా ఏ ఇతర వ్యాధులకు టీకాలు అభివృద్ధి చేస్తున్నారు..
పదికి పైగా కొత్త టీకాల అభివృద్ధిపై కసరత్తు చేస్తున్నాం. ఇందులో చికున్ గున్యా, జికా వ్యాక్సీన్లు కూడా ఉన్నాయి. ఇటువంటి వ్యాక్సీన్లను ఇప్పటి వరకూ బహుళజాతి కంపెనీలు కూడా అభివృద్ధి చేయడం లేదు. ఆఫ్రికాలో మెదడువాపు వ్యాధి కోసం రెండు వ్యాక్సీన్లను అభివృద్ధి చేశాం. ఇందుకు వెల్‌కమ్ ట్రస్ట్ 40 లక్షల డాలర్ల గ్రాంట్ ఇచ్చింది. టాక్సికాలజీ పరీక్షలు జరుగుతున్నాయి. ఒక్కో టీకా అభివృద్ధి చేయడానికి రూ.800 కోట్ల వరకూ ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఇప్పటివరకూ కంపెనీకి వచ్చిన లాభాలతోపాటు అంతర్జాతీయ ఏజెన్సీలు ఇచ్చే సాయాన్ని పరిశోధన, అభివృద్ధికే ఖర్చు చేస్తున్నాం. భారత్ బయోటెక్ ప్రపంచంలోనే అగ్రగామి ఇన్నోవేటివ్ కంపెనీ. పెద్ద, పెద్ద బహుళ జాతి కంపెనీలు చేయని రిస్క్‌ను భారత్ బయోటెక్ చేస్తోంది.
? పబ్లిక్ ఇష్యూకు వచ్చే ఆలోచన ఉందా?
మా వద్ద తగినంత నగదు ఉంది. ప్రస్తుతం మాది రుణ రహిత కంపెనీ. పెట్టుబడిదారుల నుంచి ఏదైనా ఒత్తిడి వచ్చినప్పటికీ.. పరిశోధన, అభివృద్ధి, కంపెనీ వృద్ధే మాకు ముఖ్యం. ప్రస్తుతానికి పబ్లిక్ ఇష్యూ వంటి ఆలోచనలేమీ లేవు. కంపెనీలో పెట్టుబడులు పెట్టడానికి పీఈ సంస్థలు కూడా ఆసక్తి చూపుతున్నాయి. మాకు ప్రస్తుతానికి నిధుల అవసరం లేదు.
? దేశీయ టీకా పరిశ్రమకు పోటీ ఎదురవుతోందంటున్నారు. నిజమేనా
దేశీయ టీకా పరిశ్రమకు చైనా నుంచి పోటీ ఎదురవుతోంది. చైనా కంపెనీలు అక్కడ 5 డాలర్లకు విక్రయిస్తున్న వ్యాక్సిన్‌ను ఇక్కడ ఒక డాలరుకు విక్రయిస్తున్నారు. టైఫాయిడ్ భారత్‌లో తీవ్ర సమస్యగా ఉంది. అయితే.. దీన్ని గురించి పట్టించుకోవడం లేదు. వ్యాక్సినేషన్‌కు కూడా ఆసక్తి చూపడం లేదు. చాలా రాష్ట్ర ప్రభుత్వాలు యాంటీ బయోటిక్స్ కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతున్నాయే తప్ప వ్యాక్సినేషన్‌పై చేసేది జీవిత కాల పెట్టుబడిగా భావించడం లేదు. కనీసం రాష్ట్ర ప్రభుత్వాలైనా తమ ఆరోగ్య సంరక్షణ బడ్జెట్‌లో ఒక శాతం నిధులను స్థానిక సమస్యలకు అవసరమైన టీకాల అభివృద్ధి, వ్యాక్సినేషన్‌పై ఖర్చు చేయాలి. హైదరాబాద్‌లోని మురికివాడల్లో ప్రధాన సమస్య టైఫాయిడ్. హైదరాబాద్‌లోని ఫీవర్ ఆసుపత్రిలో 26 శాతం టైఫాయిడ్ కేసులే. హైదరాబాద్‌లో స్వైన్‌ఫ్లూ ప్రధాన సమస్యగా ఉంది. ఈ సమస్య తీవ్రతను 2015లోనే గుర్తించాం.